Wednesday, October 3, 2012

మనిషి మార్క్సిజం

'పాత ప్రశ్నలకు కొత్త జవాబులతో పాటు కొత్త ప్రశ్నలు వేసిన వ్యక్తి కె.బాలగోపాల్.అయితే నిత్య జీవితంలో,సామాజిక రంగంలో నిజాయితీ నిబద్ధతలతో కూడిన ఆయన సామాన్య జీవితాన్ని ప్రశంసించినంతగా బౌద్ధిక రంగంలో ఆయన కృషిపైన చర్చ జరగకపోవడం తెలుగు సమాజపు వైఫల్యంగానే భావించాలేమో'.ఇది కె.బాలగోపాల్ రాసిన 'మనిషి మార్క్సిజం'పుస్తకంలో ప్రచురణకర్త ఆర్.కె.వెలివిచ్చిన అభిప్రాయం.త్వరలో విడుదల కాబోతున్న ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు ...

ఎల్లకాలం ఇలాగే బతకాలనుకుంటున్నామా.. సోషలిజం విఫలం అయితే ఇక ప్రపంచంలో మిగిలింది పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక్కటే. ఇవి రెండూ కాక వేరే వ్యవస్థలు గతంలో ఉన్నాయి గానీ వాటికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటి తప్ప వేరే ఏదీ సాధ్యం కాదు. కాబట్టి, సోషలిజం విఫలమయిందని అనేవాళ్లు, ఇకపైన మనం ఎల్లకాలం పెట్టుబడిదారీ వ్యవస్థలోనే బతకడానికి సిద్ధంగా ఉన్నామా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మనుషుల శ్రమను వ్యాపార సరుకుగా మార్చి ఆ సరుకుకు గిరాకీ తక్కువయినప్పుడల్లా కోట్లాది జనాన్ని నిరుద్యోగంలో పడేసే వ్యవస్థలో ఎల్లకాలం బతకడానికి సిద్ధంగా ఉన్నామా?

మనుషుల శ్రమనే కాక, సకల జీవిత అవసరాలనూ వ్యాపార సరుకులుగా మార్చి డబ్బున్నవాళ్ల అవసరాలను మాత్రం తీర్చే వ్యవస్థలో కలకాలం బతకడానికి సిద్ధంగా ఉన్నామా? తన లాభార్జన కోసం మనకు లేని అవసరాలనూ అక్కరలేని కోరికలనూ కల్పించి, మనిషిలోని అల్పత్వాన్నంతా బజార్లో పెట్టి, దానిని సంతృప్తిపరచడం కోసం ప్రకృతిని ధ్వంసం చేసి, మనకు ఆరోగ్యమూ మనశ్శాంతీ లేకుండా చేసే వ్యవస్థలో ఇక శాశ్వతంగా బతకదల్చుకున్నామా? స్వార్థాన్నీ అవినీతినీ అబద్ధాన్నీ ప్రకృతి సహజమయిన విషయాలుగా భావించి 'ఇది మానవనైజం' అనే నైరాశ్య తత్వాన్ని బోధించే వ్యవస్థలో ఎల్లకాలం బతకడానికి సిద్ధంగా ఉన్నామా? చివరికి కళను సహితం వ్యాపార సరుకుగా మార్చి, మనుషుల బలహీనతలను రెచ్చగొట్టి డబ్బులు చేసుకునే సంస్కృతిని కలకాలం భరించడానికి సిద్ధంగా ఉన్నామా? స్త్రీలకూ పురుషులకూ, కూలివాళ్లకూ మేధావులకూ, పట్టణాలకూ గ్రామాలకూ మధ్య తరతరాలుగా ఉంటూ ఉన్న అసమానతలను పోగొట్టే బదులు తన లాభార్జన కోసం కొత్త రూపాలలో వాటిని పునరావృతం చేసే వ్యవస్థలో శాశ్వతంగా బతకదల్చుకున్నామా? అన్ని వస్తువులూ వ్యాపార సరుకులయిపోయిన వ్యవస్థలో మనుషులకు ఒంటరితనమూ, ఆ ఒంటరితనానికి మత్తుపదార్థాలూ మాదకద్రవ్యాలూ తప్ప వేరే పరిష్కారం చూపించలేని సమాజాన్ని ఎల్లకాలం భరించడానికి సిద్ధంగా ఉన్నామా?

ఈ ప్రశ్నలు ప్రతీ ఒక్కరూ తమకు తాము వేసుకొని సమాధానం చెప్పుకోవాలి. ఇట్లా బ్రతకడానికి సిద్ధంగా లేమని సమాధానం చెప్పుకునేటట్టయితే సోషలిజం విఫలం అయిందని కేరింతలు కొట్టడం మానేసి, అది ఎందుకు విఫలం అయిందో ఆలోచించి, తిరిగి సోషలిజాన్ని నిర్మించే ప్రయత్నం విజయవంతంగా చేయాలంటే ఏం చేయాలో ఆలోచించాలి.

ఏ ఏ ఏ మానవ ప్రవృత్తి శాశ్వతమయిన 'మానవ ప్రవృత్తి' అంటూ ఏదీ లేదని మార్క్సిస్టులు తరచుగా అంటూంటారు. ఈనాటి మార్క్సిస్టులే కాదు, మార్క్స్ కూడా స్వయంగా అన్నాడు. చాలా విషయాలలో భిన్నంగా కాకున్నా స్వంతంగా ఆలోచించిన ఆంటోనియో గ్రామ్‌సీ కూడా అన్నాడు. చారిత్రక క్రమంలో మానవ ప్రవృత్తిలో మార్పులు లేకుండా పోలేదు గానీ అంతమాత్రం చేత 'మానవ ప్రవృత్తి' అనేది ఆలోచించకుండా కొట్టి పారేయగల విషయం కాదు. భావవాద ఆలోచన నుండి పుట్టిన భ్రమ కాదు. శాశ్వతమయిన మానవ ప్రవృత్తి అనేదేదీ లేకపోయినా మానవ ప్రవృత్తిలో అన్ని సమాజాలతో అన్ని కాలాలలో బలంగా ఉండే కొన్ని లక్షణాలున్నాయి. అదట్లా ఉంచి మారుతున్న ఈ మానవ ప్రవృత్తికీ బయటి ప్రపంచంలో వచ్చే మార్పులకూ మధ్యనున్న సంబంధం సరళమయింది కాదు. సామాజిక వ్యవస్థలో మౌలికమయిన మార్పు వచ్చినప్పుడు దానికి తగినట్టు మానవ ప్రవృత్తి కూడా మారిపోతుందని భావించి, ఆ ప్రవృత్తి గురించి ఆలోచించనవసరం లేదని చారిత్రక భౌతికవాద సిద్ధాంతం ఇప్పటిదాకా చెప్తూ ఉంది. మార్క్సిస్టులందరికీ కాకున్నా కనీసం మార్క్సిస్టు సాహిత్యకారులకు ఇది నిజం కాదని తెలియదంటే నమ్మడం కష్టం.

ఈ తాత్విక దృష్టిలోపం కారణంగా మార్క్సిజం చాలా నష్టపోయింది. ఉదాహరణకు మార్క్సిస్టులు సిగ్మండ్ ఫ్రాయిడ్‌ను అర్థం చేసుకోక ఆయన్ని మానవ అవసరాలలో సెక్స్‌కు అనవసరమైన ప్రాముఖ్యం ఇచ్చిన వ్యక్తిగా హేళన చేయడం నేర్చుకున్నారు. ప్రత్యక్ష పరిచయం అవసరం లేకుండా వినికిడి పాండిత్యం మీద కాలక్షేపం చేసే తెలుగుజాతి మేధావి వర్గం ఫ్రాయిడ్‌కు చాలా అన్యాయం చేసింది. వారిలోని మార్క్సిస్టులు తమ అవగాహనకు చాలా మేలు చేయగల ఫ్రాయిడ్ ఆలోచనలను తృణీకరించి తాము చాలా నష్టపోయారు.

ఏ ఏ ఏ ఎవరి వైఫల్యం? ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమం, కాంగ్రెస్ వారి జాతీయోద్యమం బలంగా ఉండిన కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఈ రోజు రౌడీయిజం, కులతత్వం, బాబా భక్తి, అశ్లీల సంస్కృతి రాజ్యం చేస్తున్నాయని విమర్శిస్తుంటాం. దీనిని ఆ ఉద్యమాల వైఫల్యంగా గుర్తిస్తున్నాం. ఇది వైఫల్యమే కానీ ఆ వైఫల్యం ఎక్కడుందో సరిగ్గా గుర్తిస్తున్నామా? ఒకనాడు తమ గొడుగు కిందికి వచ్చిన ప్రజానీకాన్ని శాశ్వతంగా ఆ గొడుగు కింద ఉంచుకోలేకపోవడాన్ని వైఫల్యం అంటున్నామా? ఇది వాస్తవికమైన విమర్శేనా? ఆనాడు ఆ ప్రజానీకం ఏం కోరి ఆ ఉద్యమాలలోకి వచ్చారో, ఏ మేల్కొలుపు, ఏ వ్యక్తిత్వ వికాసం, ఏ ఆకాంక్ష వాళ్లను ఆ ఉద్యమాలలోకి తీసుకు వెళ్లిందో, ఆ మేల్కొలుపుకూ ఆ మేల్కొలుపు కల్గించిన ఉద్యమ అంతిమ లక్ష్యాలకూ ఉన్న సంబంధం ఏపాటిదో - ఈ విషయాలు ఆలోచించలేకపోవడాన్ని వైఫల్యం అంటున్నామా?

అయితే ఆ వైఫల్యం ఈనాటికీ కొనసాగడం లేదా? మొదట కమ్యూనిస్టు ఉద్యమంవైపు ఆకర్షితులయింది మధ్యతరగతి శూద్ర అగ్రకుల రైతాంగం అనీ, వారికి కమ్యూనిజంతో ఉన్న అవసరం పరిమితమేననీ గుర్తించి, ఆ వర్గాన్ని అధిగమించి అట్టడుగు వర్గాలలోకి కమ్యూనిస్టు పార్టీ పురోగమించలేకపోవడం కమ్యూనిస్టు ఉద్యమ వైఫల్యం అనుకుంటే - ఆ అట్టడుగు వర్గాలలో కూడా కూలిరేట్లు పెరిగి, కొందరికి కొంత భూమి దొరికి, అంటరానితనం పోయి, కొందరికి ఉద్యోగాలు దొరికిన తరువాత కనీసం ఆ వర్గంలోని అగ్రగామి విభాగమైనా కమ్యూనిస్టులను కాదని కాంగ్రెస్ వైపు, బాబాల వైపు, సినిమాల వైపు ఆకర్షితులు కారని నమ్మడానికి ఆధారాలున్నాయా? కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఆనాడు కమ్యూనిస్టు పార్టీకి అట్టడుగు వర్గాలలో పునాది ఉన్నచోట ఇదే జరగలేదా?

దీనిని కమ్యూనిస్టు వైఫల్యంగా గానీ ఆ వర్గాల స్వార్థంగా గానీ అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. చరిత్ర పరిణామక్రమంలో సహజమైన విషయంగా అర్థం చేసుకోవడం సబబుగా ఉంటుంది. సామాజిక మానవ ప్రవృత్తికీ చరిత్రకూ మధ్యనున్న సంబంధం గురించి మనం లోతయిన అవగాహన పెంపొందించుకోనంత కాలం - అసలు ఆ విషయాన్ని గురించి అవగాహన అవసరం అని గుర్తించనంత కాలం - ఈ విషయం మనకు అర్థం కాదు. 'మనిషి'ని గురించి కొన్ని పడికట్టు సూత్రాలు జేబులో పెట్టుకొని ఎదురయిన ప్రతీ ప్రశ్నకూ రెడీమేడ్ జవాబులు చెప్తూ ఉంటాం.

ఏ ఏ ఏ తెలంగాణ కొన్ని పోరాటాలలో ప్రత్యేకమైన ఉనికిని - తమ అస్తిత్వాన్ని నిర్వచించే విశిష్టతను - కాపాడుకునే ఆకాంక్ష కొంత ఉన్నమాట వాస్తవమే. ఉదాహరణగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోవచ్చును. భాషా సంస్కృతులలో తెలంగాణకు ఉన్న విశిష్టత ఉమ్మడి 'తెలుగుతనం' అనే ఆధిపత్య భావనలో మునిగిపోయి తన ప్రత్యేకతను కోల్పోకుండా ఉండాలన్న ఆరాటం తెలంగాణ ఉద్యమంలో ఉంది. కానీ అదొక్కటే దానికి ప్రేరణ కాదు. సాగునీటి నుండి విద్య వరకు వివిధ రంగాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఉంది. అది తెలంగాణ ఉద్యమానికి ఒక ముఖ్య ప్రేరణ. వీటిలో ఏది అన్నిటికంటె ముఖ్యమైన ప్రేరణ అనే చర్చ ప్రస్తుతానికి అనవసరం గానీ అది కేవలం 'అస్తిత్వ పోరాటం' కాదు. 'గుర్తింపు రాజకీయం' మాత్రమే కాదు. ఏ ఏ ఏ కొత్త ఆలోచనలు లేవు బ్రాహ్మణీయ తాత్విక సంప్రదాయం భాష్యకారుల సంప్రదాయం. 'ఇది నేను చెప్తున్నాను' అని ప్రకటించిన బ్రాహ్మణ పండితుడు ఒక్కడూ లేడు. పరిస్థితులు మారుతూ ఉన్నాయి కాబట్టి ఒకసారి కాకపోతే ఒకసారి కొత్తగా మాట్లాడక వారికి కూడా తప్పలేదు గానీ అప్పుడు కూడా 'నేను వేదానికి భాష్యం చెప్తున్నాను' అని మాత్రమే అన్నారు. స్వంత ఆలోచనకు బ్రాహ్మణీయ సంప్రదాయంలో 'లెజిటిమెసీ' లేదు. అది అన్ని ఉద్యమాలలోకీ ప్రవేశించి సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ అనే కొత్త పునాదులను వెతుక్కొని గట్టిగా స్థిరపడింది.

ఏ ఏ ఏ ఏ మార్పయినా ప్రజాస్వామ్యం ద్వారానే ఇక మీదట సోషలిజం నిర్మించే ప్రయత్నం ఎక్కడ జరిగినా అది ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే జరగక తప్పదు. ఒకవేళ ఒక కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం ద్వారా అధికారానికి వచ్చినా అది సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంబంధించిన కృషిని రాజకీయ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే జరపవలసి ఉంటుంది. ఈ సందేశంతో పాటు, దీనికి అనుసరించవలసిన మార్గమేమిటన్న ప్రశ్నను 20వ శతాబ్దం వదిలి వెళ్లింది.

దీనికి సంబంధించిన సిద్ధాంత చర్చ యూరప్‌లో ఎప్పటినుండో జరుగుతున్నది గానీ కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న మనబోటి దేశాలలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడూ జరగడం లేదు. అన్ని వైఫల్యాలకు బయట సామ్రాజ్యవాదం, లోపల రివిజనిజం కారణం అన్న విశ్లేషణ మన దగ్గర కమ్యూనిస్టు మేధావులకు సంతృప్తినిస్తున్నది.

ఏ ఏ ఏ మూలాల నుంచి పునరాలోచన నాకు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అసహ్యం. దానిని మానవ జాతి ఏ విధంగా అధిగమిస్తుందో ఎవ్వరికీ తెలీదని నేను అనుకుంటున్నాను. మార్క్సిజం పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించడానికి పనికి వచ్చినంతగా దానిని అధిగమించడానికి పనికిరాదని ఈ శతాబ్దం చరిత్ర రుజువు చేసిందని నా అభిప్రాయం. అది ఏవిధంగా జరగగలదో అర్థం చేసుకోవడానికి మూలాల నుండి పునరాలోచించాలని నేను అనుకుంటున్నాను. దీనికి జవాబు దొరుకుతుందని హామీ ఏమీ లేదు. అయినప్పటికీ అన్వేషణ జరపవలసిందే. పెట్టుబడిదారీ వ్యవస్థతో సరిపెట్టుకోవడం అంటే మానవ జీవితాన్ని అనైతిక స్థాయిలో ఉంచివేయడమే. మనుషుల మధ్య 'ఉపయోగం' అనేది తప్ప వేరే విలువలేవీ లేని జీవితంతో సరిపెట్టుకోవడమే. ఇది తగదని నా అభిప్రాయం. బాలగోపాల్ 3వ వర్థంతి సందర్భంగా 7న హైదరాబాద్ భారతీయ విద్యాభవన్(కింగ్‌కోఠి)లో, 8న వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది.